తుమ్మును ఆపితే ప్రాణాపాయం!

186
SHARE

లండన్, జనవరి 16: సాధారణంగా పదిమందిలో ఉన్నప్పుడో, ఆఫీసులో పని చేసుకుంటున్నప్పుడో తుమ్ములు వస్తే ఆపేసు కోడానికి ప్రయత్నించేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ అది ఎంత ప్రమాదకరమో తెలుసా? తుమ్ము ఆపుకోవడం వల్ల గొంతు లోపల గాయం కావచ్చు, చెవిలో ఉండే కర్ణభేరి పగిలిపోవచ్చు, లేదా మెదడులో ఉండే నరాలు ఉబ్బిపోయి ప్రమాదం సంభవించొచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
తుమ్ము వచ్చినప్పుడు చాలా బలంగా బయటకు వస్తుంది. కొంతమందికి అయితే చాలా పెద్ద శబ్దంతో కూడా తుమ్ములు వస్తాయి. అలాంటప్పుడు పదిమందిలో చిన్నతనంగా ఉంటుందని భావించి ఎలాగోలా దాన్ని ఆపుకోడానికి ప్రయత్నిస్తారు. ఆపుకోవడం సాధ్యం కాదని తెలిసినా అలాంటి ప్రయత్నాలు చేసేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ 34 ఏళ్ల వ్యక్తి ఇలాగే తుమ్ము ఆపుకోవడం వల్ల ఇంగ్లండ్‌లోని లీసెస్టర్ ప్రాంతంలో ప్రాణాల మీదకు తెచ్చుకుని ఆస్పత్రిలో ఎమర్జెన్సీలో చేరాల్సి వచ్చింది. అతడి మెడ వాచిపోయి విపరీతంగా నొప్పి రావడంతో ఆస్పత్రికి వచ్చాడు. తుమ్ము ఆపుకోడానికి ముక్కును అదిమిపెట్టేవాడినని, ఆ తర్వాత మెడలో ఏదో ఉబ్బినట్లు అనిపించి నొప్పి మొదలైందని ఆ వ్యక్తి చెప్పాడు. వెంటనే వైద్యులు అతడికి సీఏటీ స్కాన్ తీస్తే.. తుమ్ము బలానికి అతడి గొంతు వెనక వైపు తీవ్రమైన గాయం కావడంతో పాటు నరాలు కూడా ఉబ్బాయి. దాంతో అతడు ఏదైనా మింగడం గానీ, మాట్లాడటం గానీ చేయలేకపోతున్నాడు. ముందుగా అతడికి ట్యూబు ద్వారా ఆహారం అందించి, తర్వాత యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేశారు. అతడి నొప్పి, వాపు రెండూ తగ్గేవరకు అలాగే చేయాల్సి వచ్చింది. వారం రోజుల చికిత్స తర్వాత అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. తుమ్ములను ఆపుకోడానికి ముక్కు నొక్కిపెట్టడం, మూసేసు కోవడం లాంటివి చేయడం చాలా ప్రమాదకరమని, అలా చేయకుండా తుమ్ము వచ్చినపుడు తుమ్మేయడమే మంచిదని వైద్యనిపుణులు హెచ్చరించారు.
కొన్ని సందర్భాలలో అయితే తుమ్మును ఆపుకున్నందువల్ల ఊపిరితిత్తుల మధ్య కొంత గాలి చొరబడి ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడుతుందన్నారు. ఒక్కోసారి మెదడులో రక్తనాళాలు ఉబ్బిపోతాయని కూడా వివరించారు. అందువల్ల తుమ్ములు వచ్చినపుడు మాత్రం అస్సలు ఆపే ప్రయత్నం అన్నదే చేయొద్దు!!