ముర్రుపాలే అమృతం…

225
SHARE


అమ్మపాలతో తల్లీబిడ్డకు ఎంతో ఆరోగ్యం
‘ప్రతి శిశువుకు ప్రకృతి అందించే అమూల్య సంపద తల్లిపాలు. బిడ్డకు తల్లి పాలు అమృ తంతో సమానం. ప్రేమానురాగాలతో బిడ్డకు తల్లి పాలుపట్టిస్తే జీవితాంతం ఆరోగ్యంగా మనుగడ సాగిస్తారు. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో, వజ్ర సమానమైన రోగ నిరోదక శక్తిని పొందాలంటే తల్లి పాలు కీలకం. పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పడితే తల్లితోపాటు బిడ్డకు ఆరోగ్య కరం. ఎన్నోరకాల వ్యాధుల నివారణకు దోహదం చేస్తుంది.’’
తల్లికి ప్రయోజనాలు
తల్లిపాలు శిశువుకే కాకుండా తల్లికి కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. శిశువుకు పాలివ్వడం వల్ల తల్లి శరీరం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. రక్తహీనత నుంచి కాపాడుకుంటుంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల అండ క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌ రాకుండా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. స్థనాల్లో పాలు గడ్డలు కట్టకుండా తల్లికి, శిశువు ఆర్యోగ్యానికి ఎంతో మేలు.
తల్లిపాలపై సరైన అవగాహన లేకపోవడంతో 60శాతం పిల్లలు రక్తహీనతకు గురవుతున్నారు. 56శాతం శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన తల్లి పాలను బిడ్డ ఎంత వయస్సు వచ్చేవరకు ఇవ్వాలి. రోజుకు ఎన్నిసార్లు ఇవ్వాలి.. తల్లిపాలు పుష్కలంగా రావాలంటే ఏం తినాలి.. ముర్రుపాలు బిడ్డకు ఎప్పుడు పట్టాలి.. ఇలా అనేక అంశాలపై అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. ఆధునిక కాలంలో అమ్మలకు ఇలాంటి విషయాలపై అసలు అవగాహన ఉండకపోవచ్చు.
తల్లికి బోలెడు లాభాలు
తల్లులు చనుబాలు ఇవ్వడం వల్ల బిడ్డలకు మాత్రమే కాకుండా తల్లులకు సైతం ఎన్నో లాభాలు ఉన్నాయనే విషయాన్ని తల్లులు గ్రహించాలి. గర్భదారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గడంతోపాటు త్వరగా కోలుకుంటారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. చనుబాలు ఇచ్చినందు వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గర్భానికి పూర్వం ఉన్న బరువును పొందగలుగుతారు.
తల్లిపాలు పుష్కలంగా రావాలంటే
గర్భిణీగా ఉన్నప్పటి నుంచే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. పాలు, చేపలు, గుడ్లు, వెల్లుల్లిపాయ, పండ్లు, తాజా కూరగాయలు తగిన మోతాదులో తీసుకోవాలి.
ముర్రుపాలే మురిపాలు. తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం. పుట్టగానే శిశువుకు ముర్రుపాలు పట్టిస్తే శిశువుకు ఎంతో ఆరోగ్యం. శిశువులు ఆరోగ్యంగా ఎదగా లంటే తల్లిపాలే ప్రధానం. పుట్టిన గంటలోపే శిశువులకు ముర్రుపాలు తాపించా లని, ఇలా చేస్తే శిశువులు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. పుట్టినప్పటి నుంచి 6నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలి. తల్లిపాల ప్రాధాన్యంపై చాలామందికి తెలియదు. మొదటి ఆరు నెలలు శిశువుకు ఎలాంటి ఇతర ద్రవ పదార్థాలు ఇవ్వకుండా తల్లిపాలనే పట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. మంచినీరు కూడా అవసరం లేదు. తల్లి పాలతోనే శిశువుకు సరిపోయే పోషకాలు సమృద్ధిగా ఉండడం వల్ల పిల్లలకు తల్లిపాలే పట్టించాలి. ఇతర డబ్బా పాలు పట్టించడం వల్ల శిశువులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. తల్లి శిశువుకు పాలివ్వలేని స్థితిలో ఉన్నప్పుడు సురక్షితమైన పద్ధతిలో పాలు ఇవ్వవచ్చు.
ముర్రుపాలు తప్పనిసరి ఎందుకంటే
బిడ్డ పుట్టిన మొదటి అరగంట లోపు తల్లులకు వచ్చే పాలను ముర్రు పాలు అంటారు. ఇవి ఖచ్చితంగా బిడ్డకు పట్టాల్సిందే. దీనివల్ల రోగ నిరోదకశక్తి పెరగడమే కాకుండా శివువుకు సమతుల్యమైన పోషకాహార పదార్థాలు అందుతాయి. ఇందులో మాంసకృత్తులతో పాటు విటమిన్‌ ఏ ఉంటుంది. ముర్రుపాలు వ్యాథులు రాకుండా శిశువును కాపాడుతాయి.
శిశువు పేగులను శుభ్రంచేసి మొదటి మలవిసర్జనకు దోహదం చేస్తాయి. తల్లులు సహజంగా బిడ్డకు సరిపడా పాలు రావడం లేదని అనుకోవడం అపోహ మాత్రమే. ఆరు నెలల వరకు తప్పనిసరిగా బిడ్డకు రోజూ 8నుంచి 10సార్లు పాలివ్వాలి.
బిడ్డకు లాభాలివి
తల్లిపాలు శిశువుకు సంపూర్ణమైన సంతులిత ఆహారాన్ని అందిస్తాయి.
శిశువులకు అవసరమయ్యే విటమిన్లు, ప్రొటీన్లు తల్లి పాలలో పుష్కలంగా లభిస్తాయి.
రక్తహీనత నుంచి కాపాడుతాయి.
తొలి నెలలో వివిధరకాల అంటు వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
బిడ్డ మనోవికాసానికి తల్లిపాలు ఎంతగానో తోడ్పడతాయి.
ఎలర్జీ, అస్తమా, డయాబెటిస్‌ తదితర వ్యాధులు రావు.
బాల్యం, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ.