కేంద్రమంత్రుల రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదం

107
SHARE

కేంద్రమంత్రుల రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్రమంత్రి పదవులకు సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజు చేసిన రాజీనామాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు… శాస్త్ర, సాంకేతికశాఖ సహాయమంత్రి సుజనాచౌదరి గురువారం తమ పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం 6 గంటలకు దిల్లీలోని 7-లోకకల్యాణ్‌మార్గ్‌లో ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఇద్దరూ సంయుక్తంగా రాజీనామా లేఖలు సమర్పించారు. ప్రజా సెంటిమెంట్‌ను గౌరవించి కేంద్రం నుంచి వైదొలగాలని తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు తామిద్దరం రాజీనామాలు చేసినట్లు ప్రకటించారు.

ఇద్దరితో ప్రధాని సుమారు 10 నిమిషాల పాటు సంభాషించారు. ఈ సందర్భంగా కారణాలను వారు ఆయనకు వివరించారు.ప్రభుత్వంలో పనిచేసే అవకాశం కల్పించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు దారితీసిన కారణాలను వివరిస్తూ ఒక లేఖను ప్రధానికి ఇవ్వడంతో పాటు, రాష్ట్రపతిని సంబోధిస్తూ రాసిన రాజీనామా పత్రాన్ని దానికి జత చేశారు. అశోక్‌గజపతిరాజు మాత్రం ఎలాంటి కారణాలు చెప్పకుండా తాను పదవికి రాజీనామా చేస్తున్నానని, దాన్ని ఆమోదించాలని కోరారు.ఆ రాజీనామా లేఖలను కేంద్రం రాష్ట్రపతి వద్దకు పంపగా వాటిని ఆయన ఆమోదించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవరకు కేంద్ర పౌరవిమానయాన శాఖను ప్రధాని మోదీ తన వద్దనే ఉంచుకోనున్నారు.