పార్లమెంట్ లో టీఆర్ఎస్ నిరసన తెలపడం లేదా?

100
SHARE

పార్లమెంట్ లో నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్ సభ్యులకు ఒక న్యాయం, అసెంబ్లీలో నిరసన తెలిపే కాంగ్రెస్ సభ్యులకు మరో న్యాయాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ క్షణం పార్లమెంట్ లో కేసీఆర్ బిడ్డ కవిత, ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ సుమిత్రా మహాజన్ ముందు నిలబడి ఉందని, కాగితాలు చించి వేస్తున్నారని గుర్తు చేసిన ఆయన, పార్లమెంట్ నుంచి టీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేస్తే హర్షిస్తారా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. పార్లమెంట్ లో ప్రతిపక్షం ఉండవచ్చుగానీ, రాష్ట్ర అసెంబ్లీలో ఉండరాదన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీని టీఆర్ఎస్ భవన్ కో, ప్రగతి భవన్ కో మార్చుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కౌన్సిల్ చైర్మన్ కు జరిగిన ఘటన బూటకమని, కేసీఆర్ ఆడిన నాటకమని ఆరోపించారు.

స్వామిగౌడ్ ని పరామర్శించిన టీఆర్ఎస్ నేత కేకే

తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు జరిగిన సంఘటనలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైన విషయం విదితమే. సరోజనీ దేవి కంటి ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ ని టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు (కేకే) పరామర్శించారు. అనంతరం, మీడియాతో కేకే మాట్లాడుతూ, స్వామిగౌడ్ కంటి కార్నియా దెబ్బతిందని వైద్యులు చెబుతున్నారని అన్నారు. స్వామిగౌడ్ పై అసెంబ్లీలో దాడి జరగడం బాధాకరం, దురదృష్టకరమని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ నిరసనల స్థాయి హద్దులు దాటిందని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.