మహిళా నేత దారుణ హత్య

95
SHARE

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రాణిస్తున్న యువ మహిళా నేత, కుమార్తె కళ్ల ముందే దారుణ హత్యకు గురైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. కాటారం మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలు రామిల్ల కవిత (30)ను ఆదివారం రాత్రి ఆమె ఇంట్లోనే కిరాతకంగా హత్య చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన కవిత విభేదాల కారణంగా పదేళ్ల కిందటే భర్త నుంచ విడిపోయి తన ఇద్దరు కుమార్తెలు శ్రీజ (15), శిరిణి(14)లతో కలిసి ఉంటోంది. మంథనిలో ఆదివారం బంధువుల ఇంట్లో వివాహానికి కవిత తన పిల్లలతో కలిసి వెళ్లారు. వేడుకల అనంతరం వధువుకు తోడుగా తన చిన్న కుమార్తె శిరిణిను పంపి, పెద్ద కుమార్తె శ్రీజతో ఇంటికి చేరుకున్నారు.

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండుగులు కవితపై హత్యాయత్నం చేస్తుండగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన శ్రీజ కాళ్లు, చేతులు కట్టేసి మరో గదిలో బంధించారు.అంతేకాదు కేకలు వేస్తే నిన్నుకూడా చంపేస్తామని బెదిరించారు. తన కళ్లముందే కన్నతల్లిపై జరుగుతున్న దాడిని తట్టుకోలేక ఆ చిన్నారి కన్నీరుమున్నీరుగా విలపించింది. అక్కడే ఉన్న కత్తిపీటతో కవితపై దాడిచేసిన దుండగులు ఆమెను నరికి హత్య చేశారు. కొద్దిసేపు అక్కడే ఉండి కవిత మృతి చెందినట్టు నిర్ధరించుకున్న తర్వాత ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను తీసుకొని పారిపోయారు. అనంతరం శ్రీజ ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేసింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.