టీఆర్టీ రాతపరీక్షల నిర్వహణకు సర్వంసిద్ధం

170
SHARE

ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) రాతపరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) సర్వంసిద్ధం చేసింది. టీఆర్టీ రాతపరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షా కేంద్రాలకు సకాలంలో హాజరుకావాలని అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ సూచించింది. ఆలస్యమైతే పరీక్షా కేంద్రాల్లోని అనుమతి ఉండబోదని స్పష్టం చేసింది. ఉదయం పరీక్షకు 8.30 నుంచి 9.15 గంటల వరకే కచ్చితంగా చేరుకోవాలని సూచించింది. మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంట నుంచి 1.45 గంటల వరకే చేరుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
 

24వ తేదీన లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. 25వ తేదీన ఎస్జీటీ, 26, 27 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లం, గణితం, సోషల్, భౌతికశాస్త్రం (ఆంగ్ల మాధ్యమం), లాంగ్వేజ్ (ఉర్దూ, మరాఠి, హిందీ), 28వ తేదీన పీఈటీ, స్కూల్ అసిస్టెంట్ (హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ) అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 2వ తేదీన సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), 3వ తేదీన స్కూల్ అసిస్టెంట్ (బయోలాజికల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, సోషల్‌స్టడీస్, ఫిజికల్ సైన్స్), 4వ తేదీన స్కూల్ అసిస్టెంట్ (బయో సైన్సెస్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ – తెలుగు మీడియం), పీఈటీ పరీక్షలు ఉండనున్నాయి. పరీక్ష కేంద్రాలు, ఇతర వివరాలను తమ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. టీఆర్టీ అభ్యర్థుల కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటుచేసినట్టు తెలిపింది. 8333923740 లేదా helpdesk@tspsc.gov.in ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నది.
పరీక్షహాల్‌లో నమోదు ప్రక్రియ..
– అభ్యర్థి (ఆమె/అతడు) పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించాలి.
– ఎంట్రెన్స్‌లో ప్రదర్శించే సీటింగ్ ప్రణాళికను చూసుకొని, కేటాయించిన ప్రత్యేకమైన పరీక్ష హాల్‌లోకి వెళ్లాలి.
– ఎగ్జామినేషన్ హాల్ తెలుసుకున్న తరువాత ఫొటో, వేలిముద్రను ఇవ్వడానికి నమోదు టేబుల్ వద్దకు వెళ్లాలి.
– పరీక్ష కేంద్రంలో వందకుపైగా కంప్యూటర్లు అందుబాటులో ఉంటే, అప్పుడు రెండు నమోదు టేబుళ్లు ఉంటాయి.
– అభ్యర్థి టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన హాల్‌టికెట్, ఒరిజినల్ గుర్తింపుకార్డు తీసుకొని రావాలి.
– నమోదు టేబుల్ వద్ద హాల్‌టికెట్, గుర్తింపుకార్డును చూపాలి.
– అక్కడ సీబీఆర్టీ వారు అభ్యర్థి హాల్‌టికెట్, గుర్తింపుకార్డును ధ్రువీకరించి, టీఎస్‌పీఎస్సీ అందించిన జాబితాలో అభ్యర్థి పేరును తనిఖీచేస్తారు. వివరాలు సక్రమంగా ఉంటేనే అభ్యర్థిని పరీక్షహాల్‌లోకి పంపిస్తారు.
– అభ్యర్థి తనకు కేటాయించిన కంప్యూటర్ వద్ద కూర్చొని, ఇన్విజిలేటర్ నుంచి తదుపరి సూచనల కోసం వేచి ఉండాలి.
పరీక్ష హాల్‌లో చేయదగినవి..
– అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 9.15 గంటలు, మధ్యాహ్నం 1.45 గంటలలోపు చేరుకోవాలి. లేదంటే కేంద్రంలోకి అనుమతించరు.
– అభ్యర్థుల వివరాల ధ్రువీకరణ కోసం హాల్‌టికెట్‌తోపాటు ఏదేనీ గుర్తింపుకార్డును పరీక్ష కేంద్రానికి తప్పక తీసుకొనిరావాలి. (ఉదాహరణకు: పాస్‌పోర్ట్, పాన్‌కార్డు, ఓటరు ఐడీ, ఆధార్, ప్రభుత్వ ఉద్యోగి అయితే గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్)
– పరీక్ష హాల్ లోపల భద్రత కోసం అభ్యర్థి ఫొటో, ఎడమ బొటనవేలి ముద్రను తీసుకుంటారు. (అసలు/నకిలీ అభ్యర్థులను గుర్తించేందుకు)
– అభ్యర్థి బహుళ ఎంపిక రకం పశ్నలకు సమాధానం ఇవ్వడానికి మౌస్ ఉపయోగించాలి.
– నిర్ణీత సమయం కాకముందే పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించరు.
– అభ్యర్థులు కేంద్రం వదిలి వెళ్లేముందు తమ వద్ద ఉన్న పెన్, రఫ్ పేపర్లను ఇన్విజలేటర్లకు తప్పక ఇవ్వాలి.
– హాల్‌టికెట్‌లో ఫొటో సరిగా కనిపించకపోతే అభ్యర్థి తనవెంట రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి.
– అభ్యర్థికి కేటాయించిన కంప్యూటర్ (లాగిన్ స్క్రీన్)పై అభ్యర్థి వ్యక్తిగత వివరాలు (ఫొటో, పేరు) కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి, వ్యత్యాసాలుంటే తక్షణమే ఇన్విజిలేటర్‌ను సంప్రదించాలి.
పరీక్ష హాలులో చేయకూడనివి..
– ఆలస్యంగా వస్తే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
– పరీక్ష హాల్‌లోకి మొబైల్ / సెల్యులార్ ఫోన్, ట్యాబ్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ వంటి పరికరాలు, వాచ్, కాలిక్యులేటర్, లాగ్ పట్టికలు, పర్సు, నోటు పుస్తకాలు, ఇతర పేపర్లు లేదా రికార్డింగ్ సాధనాలను అనుమతించరు.
– విలువైన పరికరాలు, వ్యక్తిగత వస్తువులు (ఆభరణాలు) తీసుకొని రావొద్దు. పరీక్ష హాల్ వెలుపల భద్రత ఉండకపోవచ్చు.
– అభ్యర్థులు మెహెందీ, ఇంకు తదితర పదార్థాలను చేతులు / పాదాలకు పెట్టుకోవద్దు. ఈ కారణంగా బయోమెట్రిక్ పరీక్ష కేంద్రంలో వేలిముద్ర నమోదుకాదు.
– పరీక్ష సమయంలో కీ బోర్డును తాకొద్దు. పశ్నలకు సమాధానం ఇవ్వడానికి మౌస్ ఉపయోగించండి.
– పరీక్ష సమయంలో అభ్యర్థులు సూచనలను అతిక్రమించొద్దు.
టీఆర్టీ పోస్టులు, అభ్యర్థులు వివరాలు
కేటగిరీ పోస్టులు అభ్యర్థులు
స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) 1,941 1,45,158
సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ) 5,415 89,149
భాషాపండితులు (ఎల్‌పీ) 1,011 24,219
వ్యాయామ విద్య ఉపాధ్యాయులు (పీఈటీ) 416 16,871
స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్‌ఏపీఈ) 09 2,177
మొత్తం 8,792 2,77,574
జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టులు
జిల్లా ఎల్‌పీ పీఈటీ ఎస్‌ఏ ఎస్‌ఏపీఈ ఎస్జీటీ మొత్తం
ఆదిలాబాద్‌ 122 25 118 3 1314 1582
హైదరాబాద్‌ 23 35 153 – 206 417
కరీంనగర్‌ 95 117 249 3 74 538
ఖమ్మం 81 13 92 – 160 346
మహబూబ్‌నగర్‌ 123 36 391 – 1429 1979
మెదక్‌ 125 33 214 2 876 1250
నల్లగొండ 100 56 307 – 40 503
నిజామాబాద్‌ 100 35 85 1 319 540
రంగారెడ్డి 146 16 192 – 915 1269
వరంగల్‌ 96 50 140 – 82 368
మొత్తం 1011 416 1941 9 5415 8792