సీఎం సిద్ధరామయ్యపై మాజీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు

90
SHARE

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నేత శశికళకు రాజ భోగాలు కల్పించడంపై అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఆదేశాలకు కట్టుబడే తాము శశికళకు అదనపు సౌకర్యాలు కల్పించినట్టు జైళ్ల శాఖ మాజీ డీజీపీ హెచ్ఎన్ సత్యనారాయణ రావు పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి తనపై అవినీతి నిరోధక చట్టం 1988 కింద కేసు నమోదు చేయాలంటూ గతనెల 26న ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. శశికళకు అక్రమంగా వీఐపీ సౌకర్యాలను కల్పించేందుకు సత్యనారాయణ రావు రూ. 2 కోట్ల లంచం తీసుకున్నారంటూ అప్పటి జైళ్లశాఖ డీఐజీ డి.రూప ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వం ఏసీబీని అదేశించింది.
అయితే తాను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే పనిచేశానంటూ రావు హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది జూలై 25న విచారణ అధికారి ముందు తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు సమర్పించారు. శశికళకు క్లాస్ 1 సదుపాయాలు కల్పించాలంటూ రెండు సార్లు విజ్ఞప్తులు వచ్చాయనీ.. అయితే కర్నాటక జైళ్ల నిబందనల ప్రకారం అలాంటి సదుపాయాలు కల్పించడం కుదరంటూ తిరస్కరించామన్నారు. ఆమెను జైల్లో మొదటి అంతస్తులోని మహిళా విభాగంలో ఉంచామన్నారు.

‘‘నెల రోజుల తర్వాత ముఖ్యమంత్రి నన్ను గెస్ట్ హౌస్‌కి పిలిపించి, శశికళకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. మిగతా ఖైదీల మాదిరిగానే శశికళను చూస్తున్నట్టు ఆయనతో చెప్పాను. దీంతో ఆమెకు కనీసం మంచం, పరుపు, దిండు అయినా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నందున ఆయన చెప్పినట్టుగానే చేశాను. అప్పట్లో శశికళ భద్రతా వ్యవహారాలు చూస్తున్న అనితను రోజువారీ నివేదిక ఇవ్వాలని కోరాను. ఆమె ఎప్పుడూ తన నివేదికలో ఏదైనా భద్రతా సమస్య తలెత్తినట్టు చెప్పలేదు….’’ అని రావు పేర్కొన్నారు.