తొలి తెలుగు దళిత కథా రచయిత్రి తాడినాగమ్మ కథలు రచనలు … పుస్తకావిష్కరణ సభ

239
SHARE


తొలి తెలుగు దళిత కథాయిత్రి తాడి నాగమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశాలల్లో చేర్చాలని తెలంగాణ పబ్లిక సర్వీస్ కమీషన్ చైర్మన్ ప్రొపెసర్ ఘంటా చక్రపాణి కోరారు. తొలి తెలుగు దళిత కథాయిత్రి ‘తాడి నాగమ్మ కథలు, రచనలు’ పుస్తకావిష్కరణ సభ ఈ నెల 21వ శనివారం తేదీన హైదరాబాద్‌ తెలుగు విశ్వవిద్యాలయం సమావేశమందిరంలో సాయంత్రం జరిగింది.ఈ సభకు ‘తొలితెలుగు దళిత కథాయిత్రి తాడినాగమ్మ కథలు, రచనలు’’ సంపాదకుల్లో ఒకరైన పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సభా ప్రారంభానికి ముందు కీ.శే. తాడి నాగమ్మ చిత్రపటానికి పుష్పాలతో నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ ఆచార్య ఘంటా చక్రపాణి పుస్తకాన్ని ఆవిష్కరించారు.

సమాజ పోకడలను ఎనభై యేళ్ల కిందనే తన రచనల్లో చూపించిన రైటర్ తాడి నాగమ్మ. ఆమె తొలి దళిత మహిళా రచయిత్రి. ఆధునిక భావాలతో .. కథలు, వ్యాసాలు రాశారు. పురుషాధిక్య సమాజాన్ని ధిక్కిరించిన సాహస పంతులమ్మ ఈ నాగమ్మ. ఎంతో మందికి విద్యాబుద్దులు నేర్పిన నాగమ్మ… దళిత, స్త్రీవాద సాహిత్యానికి తొలి మెట్టు వేశారు. తాడి నాగమ్మ సాహిత్యంపై సబాల్టర్న్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో తెలుగు కథా సాహిత్యంలో మరుగున పడేయబడిన దళిత ఆడబిడ్డ తాడి నాగమ్మ కథల్ని వెలుగులోకి తెచ్చారు.

ఈ తరానికి స్పూర్తినిచ్చేలా అప్పట్లోనే లోతైన అవగాహనతో రచనలు చేశారు తాడి నాగమ్మ. 1908 జూలై 6న బల్లాపుల్లయ్య, మహాలక్ష్మీ దంపతులకు ఆమె జన్మించారు. వీరి సొంతూరు తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు మండలం మోరివారిపాలెం గ్రామం. ఆదుర్రు గ్రామ పరిధిలోని ఏడు శివారు గ్రామాల్లో ఇదీ ఒకటి. తాడి నాగమ్మ పుట్టిననాటికే అక్కడ కొంత దళిత చైతన్యం పురుడు పోసుకున్నది. అయితే అది చాలా పరిమితంగానే ఉండేది.

 
దళితురాలైన నాగమ్మ ఆప్పట్లో స్కూలుకు వెళ్లడమనేది సాధారణ విషయం కాదు. బడిలో పంతుళ్ల నుంచి అవమానాలు ఎదుర్కొన్నారు. పట్టు విడవకుండా చదువు సాగించారు. ఆమె విద్యాభ్యాసం 1925-30 ప్రాంతంలో సాగింది. 1925లో మామిడి కుదురు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన తాడి వెంకన్నను వివాహం చేసుకున్నారామె. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు.
పెళ్లైన కొద్దిఏళ్లకే నాగమ్మ భర్త చనిపోయారు. ముగ్గురు పిల్లలను తానే చదివించారు. పిఠాపురం రాజావారి టీచర్ ట్రైనింగ్ స్కూళ్లో శిక్షణ తీసుకున్నారు. చిన్న వయస్సులోనే భర్త చనిపోయినా బెదరకుండా చదువుకుని ఎదిగారు. అప్పటికే ఆంధ్రా ప్రాంతంలో ఉన్న దళిత చైతన్యంతో, గాంధీగారి ప్రభావంతో ఆమె అనేక చరచనలు కూడా చేశారు. లోతైన పరిశీలన, అత్యంత ప్రతిభావంతమైన పరిణతితో రచనలు చేశారు నాగమ్మ.

తాడి నాగమ్మ 1934లో ఇంకెక్కడి విజయం పేరుతో రాసిన తొలి కథ గృహలక్ష్మి పత్రికలో అచ్చైంది. దాంతో పాటు భారతి పత్రికలో కూడా ఆమె కథలు అచ్చయ్యాయి. ఇది మాములు విషయం కాదు. ఇలా ఆమె సామాజిక సమస్యలు, స్త్రీల సమస్యలు, మనుష్యుల మధ్య సంబంధాలు, ఈర్ష, ఆసూయ, ద్వేషాల గురించి మంచి అవగాహనతో రచనలు చేశారు.

తొలి ప్రపంచ యుద్దం గురించి ముందుగానే అంచనా వేసి రాశారు. ప్రేమ సమస్యల గురించి, సందిగ్ద సందర్భాలను ప్రస్తావించారు. తాను ఎదగడం కోసం ఎదుటి వారిని ఎట్లా పతనం చేస్తారో చెప్తూ మంచి కథ రాశారు. ఒక ముద్దు….. సమాధులపై సౌధం నిర్మించ వద్దు… స్త్రీకన్నీరు… ప్రపంచ ఘోష మానవ విప్లవం, ప్రేమ సమస్య లాంటి రచనలు చేశారు. ఇంతటి ప్రతిభా శాలి గురించి తెలుగు సాహితీ పెద్దలు పట్టించుకోలేదు. ఆమె 1990 సెప్టెంబర్ 13న కన్నుమూశారు. నేటి తరం రచయితలకు, సమాజానికి ఆమె రచనలు స్పూర్తి దాకయంగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.