విద్యార్థులకు 'ఆగ్జిలో' బంపర్ ఆఫర్.. !

169
SHARE


దేశ, విదేశాల్లోని ప్రముఖ విద్యా సంస్థల్లో చదువుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యల కారణంగా ఎందరో విద్యార్థులకు అది కలగానే మిగిలిపోతోంది. ఇలాంటి వారి కోసం ఎలాంటి హామీ లేకుండానే రుణాలు ఇచ్చేందుకు ఆగ్జిలో ఫిన్ సర్వీసెస్ సంస్థ ముందుకొచ్చింది. వచ్చే పదిహేను నెలల కాలంలో విద్యార్థులకు 350 కోట్ల రూపాయల రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆగ్జిలో ఫిన్‌సర్వ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సిఇఒ నీరజ్‌ సక్సేనా వెల్లడించారు. హైదరాబాద్‌లో ఆగ్జిలో తొలి శాఖను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ సహా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్ధుల కోసం అవసరమైన రుణాలను అందించనున్నట్లు చెప్పారు. విద్యార్ధుల అవసరాలను బట్టి ఎలాంటి హామీ లేకుండా 20 వేల రూపాయల నుంచి 35 లక్షల రూపాయల వరకు రుణాలను ఆఫర్‌ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
భారత ఎడ్యుకేషన్‌ లోన్‌ పరిశ్రమ గత ఆర్థిక సంవత్సరంలో 20 వేల కోట్ల రూపాయల వరకు రుణాలను పంపిణీ చేసిందని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది భారత్‌ నుంచి 4 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లగా అందులో 3 లక్షల మంది రుణ సదుపాయాలను వినియోగించుకున్నారని తెలిపారు.
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఆగ్జిలో కార్యకలాపాల విస్తరణలో భాగంగా తొలి శాఖను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందని, రానున్న రోజుల్లో బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, పుణె నగరాలకు విస్తరించనున్నట్లు సక్సేనా వెల్లడించారు. కాగా 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి హైదరాబాద్‌లో 75 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. విద్యార్ధులతో పాటు విద్యా సంస్థలకు కూడా 2 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల రుణాలను ఆఫర్‌ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా బలరాంపూర్‌ చినీ మిల్స్‌ లిమిటెడ్‌ నుంచి దశల వారీగా 175 కోట్ల రూపాయలు సమీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 75 కోట్ల రూపాయలు సమీకరించినట్లు సక్సేనా తెలిపారు.