జియో 4జీ ఫీచర్ ఫోన్ ఫీచర్లు, ధరల వివరాలు లీక్!

132
SHARE

న్యూఢిల్లీ: అతి త్వరలో మార్కెట్లోకి రాబోతున్న రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ధరల వివరాలు లీకయ్యాయి. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.
లీకైన వివరాల ప్రకారం.. జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను లైఫ్ (ఎల్‌వైఎఫ్) బ్రాండ్ కింద విక్రయించనున్నారు. గతంలో లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ 2.4 అంగుళాల కలర్ డిస్‌ప్లే, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 128 జీబీల వరకు పెంచుకునే సదుపాయం, డ్యూయల్ సిమ్ (నానో+ స్టాండర్డ్ సిమ్), 2 మెగా పిక్సల్ వెనక, వీజీఏ ఫ్రంట్ కెమెరా ఉన్నట్టు తెలిసింది. ఇవే ఫీచర్లను తాజా లీకేజీ కూడా నిర్ధారించింది. అలాగే 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎఫ్ఎం రేడియో, బ్లూటూత్ 4.1+ఎల్ఈ, వీడియో కాలింగ్ సదుపాయం ఉన్నట్టు తాజా లీకేజీ ద్వారా తెలుస్తోంది.
ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఇందులో ‘కేఏఐ ఓఎస్’ను ఉపయోగించారు. ఇది ఫైర్‌ఫాక్స్ ఓఎస్ ఆధారంగా పనిచేసే హెచ్‌టీఎంఎల్ 5 కస్టమైజ్‌డ్ వెర్షన్. ఈ ఫోన్‌లో కేఏఐ ఓఎస్ ప్లస్ పేరుతో ఓ యాప్ స్టోర్ కూడా ఉండడం విశేషం. భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో 1.2 జీహెచ్‌జడ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉపయోగించినట్టు తెలుస్తున్నా అది ఏ కంపెనీదో తెలియరావడం లేదు. ఇందులో జియో యాప్స్ అయిన జియో టీవీ, మైజియో, జియో సినిమా, జియో మ్యూజిక్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఫోన్ ధర భారత్‌లో రూ.500. 4జీ ఫీచర్ ఫోన్‌కోసం జియో.. చైనా కంపెనీలైన ఝెజియాంగ్ టెకైన్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ కంపెనీ, షెంజెన్ చైనో-ఇ కమ్యూనికేషన్ కంపెనీ, క్రేవ్ అండ్ మెగాఫోన్ తదితర కంపెనీలకు దాదాపు రెండు కోట్ల హ్యాండ్ సెట్లకు ఆర్డర్ ఇచ్చినట్టు సమాచారం. ఆగస్టులో ఇవి మార్కెట్లోకి రానున్నట్టు తెలుస్తోంది.