బుల్లెట్ ట్రైన్ సమాచారం .

207
SHARE

న్యూఢిల్లీ: దేశంలో వచ్చే 2022 ఆగస్టు 15వ తేదీ నుంచి బుల్లెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత అహ్మదాబాద్ – ముంబైల మధ్య తొలి బుల్లెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ ప్రాజెక్టు కోసం గురువారం భూమి పూజ జరిగింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షింజో అబేలు పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి రైల్వే స్టేషన్ – ముంబైలోని బాంద్రా కుర్లా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రాజెక్టును చేపడతారు.
మొత్తం 508 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రైలు మార్గాన్ని 27 కిలోమీటర్ల సొరంగ మార్గంలోనూ, 12 కిలోమీటర్లు వంతెనలపైనా, మరో 468 కిలోమీటర్లు భూమిపై నిర్మించనున్నారు. ఈ మార్గంలో బుల్లెట్ ట్రైన్ నాలుగు రైల్వే స్టేషన్లలో ఆగి వెళితే ప్రయాణ సమయం 2 గంటల 7 నిమిషాల సమయం పడుతుంది.
అయితే మొత్తం 12 స్టేషన్లలో ఆగి వెళ్లేలా ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇందులో బాంద్రా కుర్లా, థానే, విరార్, బోయిసర్, వప్లే, బిల్‌మోరా, సూరత్, బహ్రుచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి స్టేషనలో ఆగి వెళ్లేలా ప్రతిపాదిస్తున్నారు. ఇలా 12 స్టేషన్లలో ఆగి వెళితే మాత్రం ప్రయాణ సమయం 2 గంటల 58 నిమిషాల సమయం పడుతుంది.
బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణ టిక్కెట్ ధర ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా… రూ.2700 నుంచి రూ.3000లోపు ఉండనుంది. కానీ, ఈ మార్గంలో విమాన టిక్కెట్ ధర రూ.3500 నుంచి రూ.4000 వరకు ఉండగా, లగ్జరీ బస్సులో రూ.1500 నుంచి రూ.2000 వరకు ఉంది.

బుల్లెట్ ట్రైన్ పనులు ప్రారంభం
మన దేశ వాసుల చిరకాల స్వప్నాల్లో ఒకటిగా చెప్పుకునే బులెట్ ట్రైన్ కల త్వరలోనే సాకారం కాబోతోంది. ముంబాయి-అహ్మదాబాద్ ల మధ్య బుల్లెట్ ట్రైన్ ను జపాన్ సాంకేతిక సహకారంలో నడపనున్నారు. బుల్లెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి వస్తే ముంబాయి-అహ్మదాబాద్ ల మధ్య ఉన్న 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం మూడు గంటల్లో చేరుకునే అవకాశం ఉంది. 2022 కల్లా బులెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముంబాయి-అహ్మదాబాద్ ల మధ్య కొత్తగా నిర్మిస్తున్న ట్రాక్ లో 21 కిలోమీటర్లు సొరంగ మార్గం కాగా 7 కిలోమీటర్లను సముద్ర గర్భంలో నిర్మిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబే చేతుల మీదుగా ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుని పోనుంది. దాదాపు లక్ష్మా 25 వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ బులెట్ ట్రైన్ ప్రాజెక్టును భారత్ చేపట్టింది. జపాన్ ఆర్థిక సహాయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు చైనా కంపెనీలు పెద్దఎత్తున ప్రయత్నాలు చేసినప్పటికీ చివరకి జపాన్ ఈ భారీ ప్రాజెక్టును చేపడుతోంది.