పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

161
SHARE


హైదరాబాద్ : నూతన జిల్లాల ఆవిర్బావం తరువాత మొదటి సారిగా అన్ని జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల నిర్వాహానకు పకడ్బందిగా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది మార్చి 15 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి ఐదున్నర లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మాస్‌ కాపీయింగ్‌ను నిరోధించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నిఘా నీడలో పరీక్షలు నిర్వహించబోతున్నారు.లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌లో ముడిపడిన ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.

మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు

తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరుగనున్నాయి. ఈసారి 11,109 పాఠశాలలకు చెందిన 5,60,395 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 5,04,545 మంది. సప్లిమెంటరీ విద్యార్థులు 35,864 మంది. ఒకేషనల్‌ విద్యార్థులు 19,986 మంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,500 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు. హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 356, రంగారెడ్డిలో 190, మేడ్చల్‌లో 186 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అతితక్కువగా అతితక్కువగా 34, వనపర్తిలో 35, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి అన్ని వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఫర్నిచర్‌, మంచినీరు, విద్యుత్‌ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రహరీగోడలు, గేట్లు సరిగాలేకపోతే వెంటనే రిపేర్లు చేయాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫర్నిచర్‌ లేకపోతే పక్క పాఠశాలల నుంచి తెప్పించి సర్దుబాటు చేయాలని ఆదేశించారు.

సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు

పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించడం జరుగుతుందన్నారు. పరీక్ష పేపర్లను బద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాలకు ప్రశ్న పత్రాలను తీసుకెళ్తున్నప్పుడు, తిరిగి తీసుకు వస్తున్నప్పుడు ప్రత్యేక పోలీస్ ఎస్కాట్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షల నిర్వాహాణకు, విద్యాశాఖ, ఆర్టీసి, ఆర్‌డబ్లూఎస్, పోస్టల్, వైద్య, పోలీస్, విద్యుత్, సంబంధిత శాఖలన్ని పరీక్షల ఏర్పాట్లను చూసుకోవాని ఆదేశించారు.
brochure printing
మాస్‌ కాపీయింగ్‌ను నిరోధించేందుకు అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. సమస్యాత్మకమైన 405 కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2016-17లో 330 కేంద్రాల్లో సీసీ కెమెరాల నీఘా నీడలో పరీక్షలు నిర్వహించారు. 2015-16లో జిల్లాకు ఒకటి, రెండు చొప్పున మొత్తం 15 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో ఈ కేంద్రాల్లో తక్కువ ఉత్తీర్ణతా శాతం నమోదుకావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈసారి విస్తృతంగా తనిఖీ స్క్వాడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో రెవెన్యూ అధికారులను నియమించనున్నారు.