‘ఆధార్’ గడువు నిరవధిక పొడిగింపు

126
SHARE


బ్యాంకు ఖాతాలు, మొబైల్ నెంబర్లతో అనుసంధానానికి ఈ నెలాఖరుతో ముగియనున్న తుది గడువును సుప్రీంకోర్టు ఈ రోజు నిరవధికంగా పొడిగించింది. సబ్సిడీ ఇవ్వడానికి తప్ప మిగిలిన వాటికి ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని డిమాండ్ చేయొద్దని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మధ్యంతర తీర్పు ఆధార్‌ రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై తుది తీర్పును వెలువరిచేంత వరకు అమల్లో ఉంటుందని బెంచ్ తెలిపింది. “చివరికి తత్కాల్ పాస్‌పోర్టు జారీకి కూడా ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరిగా కోరరాదు” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కాగా, ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఈ నెల 7న ఆధార్ కేసులో తుది తీర్పును ఈ నెలాఖరు కల్లా ఇవ్వడం సాధ్యపడకపోవచ్చని పేర్కొన్న సంగతి విదితమే. తప్పనిసరి ఆధార్ అనుసంధానంపై తామిచ్చే తీర్పు బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజిలు లాంటి ఆర్థిక సంస్థలపై ప్రభావం చూపే అవకాశముందని ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల తుది గడువును ఆఖరి క్షణంలో పొడిగిస్తే అందుకు అంగీకరించే విషయంలో భారీ సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదముందని న్యాయమూర్తులు ఏకే సిక్రి, ఏఎం ఖాన్‌విల్కర్, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం తొలుత అభిప్రాయపడింది. కాగా, గతేడాది డిసెంబరు 15న బ్యాంకు ఖాతాలు, మొబైల్ నెంబర్లతో ఆధార్ అనుసంధానానికి తుది గడువును సుప్రీంకోర్టు ఈ నెలాఖరు వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.